Saturday, May 10, 2008

చిన్న పరిచయం

కవిత్వం పేరు శిఖామణి
అసలు పేరు కర్రి సంజీవరావు
ఫుట్టింది 1957 అక్టొబర్ 30న తూర్పుగోదావరి జిల్లా యానాంలో
అమ్మా నాన్నలు ఆదిలక్ష్మి,సూర్యనారాయణ
భార్యాపిల్లలు క్రుష్నవేణి,దుర్గేశనందిని,సూర్యతేజ
చదివింది యానాం తీరం నుంచి కాకినాడ మీదుగా విసాఖ వరకు తెలుగులో ఎం.ఎ,పిహెచ్.డి
కవితా జీవిత యాత్రలో దారి దీపాలు: కందర్ప వెంకట నరసమ్మ, ప్రొ. అత్తలూరి నరసింహరావు, డా.సి.నారాయణరెడ్డి

కవిత్వం
మువ్వలచేతికర్ర- 1987
హోరుగాలి- 1988
చిలక్కొయ్య- 1993
కిర్రుచెప్పులభాష- 2000
the black rainbow- 2000
నల్లచెటూ నందివర్ధనం చెట్టు- 2005

విమర్శ గ్రంధాలు
ప్రయోగివాది పఠాభి- 1992
దళిత సాహిత్య తత్వం- 1998
వివిధ- 1998
సమాంతర- 2006

సంపాదకత్వం
అమ్మ ( కవితా సంకలనం )
తులనాత్మక వ్యాసాలు ( వ్యాస సంకలనం )
అర్ధ శతాబ్దపు ఆంధ్ర కవిత్వం ( విమర్శ )
తెలుగు ఏకాంక నాటక పరిచయం ( విమర్శ )

అవార్డులు
తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం- 1989
ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు- 1987
సమతా రచయతల సంఘం అవార్డు- 1987
వుమ్మడిసెట్టి సాహితీ పురస్కారం- 1989
బులుసు సీతారామశాస్త్రి సాహితీ పురస్కారం- 1991
గరికపాటి సాహితీ పురస్కారం- 1996
అధికార భాషా సంఘం అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి భాషా పురస్కారం- 2004
రీజెన్సీ -కళావాణి- యానాం వారి పురస్కారం- 1997

ఇతర భాషల్లోకి అనువాదం
హిందీ,ఇంగ్లీష్,ప్రెంచి

Monday, April 7, 2008

అమ్మ

నన్ను సముద్రపు వొడ్డున వొదిలేయండి...
ముత్యం దొరకలేదని బాధపడను.
ఇసుకలో పిచుక గూళ్ళు కట్టి,
ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను.
అలలు నడిచిన అడుగు జాడలు పరీక్శిస్తూ,
ఓ గుడ్డి గవ్వను ఏరుకుని
సమ్బర పడిపోతాను.

నన్ను తోటలో విడిచి పెట్టేయండి...
కోకిల పాట వినబడలేదని
కొమ్చెమ కూడా చింతించను.
కొమ్మనున్న పండుకోసం
ఎగిరి ఎగిరి అలసి సొలసి
చివరకు చతికిల పడిపోయి
చిన్నపిల్లాడిలా పిర్రలకు అమ్టుకున్న మట్టిని,
అరచేతులతో అటూ ఇటూ దులిపుకుంటాను.

నన్ను తూనీ లాగో,
సీతాకోక చిలుక లాగో,
గాలిలోకి వొదిలేయండి...
పూలు లేవని,
వెన్నెల ఇంద్రచాపం లేదని,
చిన్న బుచ్చుకోను.
గాలి భాశకు
వ్యాకరణ సర్వస్వాన్ని రాసి పారేసి,
వర్శాల గురించి,
వాయు గుమ్డాల గురించీ
మీ చెవిలో రహస్యాలను ఊదేస్తాను.

అదీ కాకపోతే,
ఓ అనాథ పిల్లాడిమల్లె
జన సమ్మర్దం గల
చౌరస్తాలో నన్ను విడిచి పేట్టేయండి...
ఆదరించే వారు లేరని
ఆవేదన చెందను.
కళ్ళు లేని కబోది చేతిలో
మువ్వల చేతికర్రనై
రోడ్డు దాటిస్తాను.

----శిఖామణి

శిఖామణి గురించి....

http://telugutanam.blogspot.com/2005/08/sikhamani-twinkling-walking-stick.html

Monday, March 3, 2008

Saturday, February 23, 2008

కొయ్యకాలు

రోజూ అవే అంకెల మీద
తిరిగిన అంకెల మీదే
తిరుగుతున్న
గడియారంలోని ముల్లులా
ఈ రోడ్ల మీద
నా కొయ్యకాలు
టక్… టక్… టక్…
నగరం రద్దీలో
నేను
కాలు పోగొట్టుకోకమునుపే
ఏ అడవో
ఈ చెట్టును పోగొట్టుకుంది.
అడవి అడవంతా
వసంతోత్సవంతో
నృత్యం చేస్తుంటే
కుష్ఠురోగపు భర్తను
నెత్తిన మోస్తున్న
పతివ్రతలా
నా కొయ్యకాలు
నన్ను కావలించుకునే వుంది.
చెవిటిదీ, మూగదీ, అవిటిదీ
అని తెలియక
రోడ్లు ఏవేవో చెప్తుంటాయి.
పత్రికల్లో
అందమైన కవిత్వం మధ్య
తెల్ల మచ్చల గురించి
నల్ల వెంట్రుకల గ్యారంటీగురించి
నరాల బలహీనతల గురించి
అసహ్యమైన ప్రకటనల్లా
అందమైన రోడ్ల మీద
నా కొయ్యకాలు వికృతంగా
కొందరిని భయపెడుతూ
కొందరి జాలినీ
సానుభూతినీ పొందుతూ…
అర్ధరాత్రి
కోర్కెలతో బరువెక్కిన
నా దేహాన్ని
‘ఆ కాసేపూ’ భరించి
నన్ను తేలికపరచే నా భర్య కంటే
పగలంతా
విసుగూ విరామం లేకుండా
నన్ను మోసే కొయ్యకాలే
గొప్పదనిపిస్తుంది ఒక్కోప్పుడు
నేను చచ్చేలోగా
నా కొయ్యకాలు చిగురిస్తే
నన్ను నేను
తలకిందులుగా పాతుకుంటాను.
అడవుల్లోనికలపంతా
జైళ్ళ కోసం, తుపాకీల కోసం
ఖర్చయిపోతున్న
నా దేశంలో
కనీసం నువ్వయినా
నాలాంటి కాళ్ళు లేని వాళ్ళ కోసం
కొయ్యను ఉత్పత్తిని చెయ్యమని
నా కొయ్యకాలును ప్రార్థిస్తాను.
లేకపోతే
స్మశానంలో
చితిమంటల మీద
నా దేహాన్ని
కట్టెలు పూర్తిగాకాల్చలేకపోయినప్పుడు
నా కొయ్యకాలే
కృతజ్ఞతతో
మిగిలిన నా దేహాన్ని
గుప్పెడు బూడిద చేసి
రుణం తీర్చుకుంటుంది.
-శిఖామణి
(ఈ కవిత "మువ్వల చేతికర్ర " కవితా సంకలనం(1987) లోనిది)