Saturday, February 23, 2008

కొయ్యకాలు

రోజూ అవే అంకెల మీద
తిరిగిన అంకెల మీదే
తిరుగుతున్న
గడియారంలోని ముల్లులా
ఈ రోడ్ల మీద
నా కొయ్యకాలు
టక్… టక్… టక్…
నగరం రద్దీలో
నేను
కాలు పోగొట్టుకోకమునుపే
ఏ అడవో
ఈ చెట్టును పోగొట్టుకుంది.
అడవి అడవంతా
వసంతోత్సవంతో
నృత్యం చేస్తుంటే
కుష్ఠురోగపు భర్తను
నెత్తిన మోస్తున్న
పతివ్రతలా
నా కొయ్యకాలు
నన్ను కావలించుకునే వుంది.
చెవిటిదీ, మూగదీ, అవిటిదీ
అని తెలియక
రోడ్లు ఏవేవో చెప్తుంటాయి.
పత్రికల్లో
అందమైన కవిత్వం మధ్య
తెల్ల మచ్చల గురించి
నల్ల వెంట్రుకల గ్యారంటీగురించి
నరాల బలహీనతల గురించి
అసహ్యమైన ప్రకటనల్లా
అందమైన రోడ్ల మీద
నా కొయ్యకాలు వికృతంగా
కొందరిని భయపెడుతూ
కొందరి జాలినీ
సానుభూతినీ పొందుతూ…
అర్ధరాత్రి
కోర్కెలతో బరువెక్కిన
నా దేహాన్ని
‘ఆ కాసేపూ’ భరించి
నన్ను తేలికపరచే నా భర్య కంటే
పగలంతా
విసుగూ విరామం లేకుండా
నన్ను మోసే కొయ్యకాలే
గొప్పదనిపిస్తుంది ఒక్కోప్పుడు
నేను చచ్చేలోగా
నా కొయ్యకాలు చిగురిస్తే
నన్ను నేను
తలకిందులుగా పాతుకుంటాను.
అడవుల్లోనికలపంతా
జైళ్ళ కోసం, తుపాకీల కోసం
ఖర్చయిపోతున్న
నా దేశంలో
కనీసం నువ్వయినా
నాలాంటి కాళ్ళు లేని వాళ్ళ కోసం
కొయ్యను ఉత్పత్తిని చెయ్యమని
నా కొయ్యకాలును ప్రార్థిస్తాను.
లేకపోతే
స్మశానంలో
చితిమంటల మీద
నా దేహాన్ని
కట్టెలు పూర్తిగాకాల్చలేకపోయినప్పుడు
నా కొయ్యకాలే
కృతజ్ఞతతో
మిగిలిన నా దేహాన్ని
గుప్పెడు బూడిద చేసి
రుణం తీర్చుకుంటుంది.
-శిఖామణి
(ఈ కవిత "మువ్వల చేతికర్ర " కవితా సంకలనం(1987) లోనిది)